Loading...

చెన్నై లో ఘనంగా కేబీ సేన ప్రారంభోత్సవం

2026 మార్చి 22 ఆదివారం:  చెన్నైలో కేబీ సేన” కైండ్ అండ్ బ్రేవ్ నినాదంతో స్థాపించబడిన సంస్థ. ఈ సంస్థ ద్వార సమాజంలో ఐక్యత, అభివృద్ధి, మరియు చక్కని భవిష్యత్ దిశగా అడుగులు పడేందుకు స్థాపించిన సంస్థ. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తూ, ప్రతి సంవత్సరం కనీసం పది మంది IAS/IPS అధికారులను తయారు చేయడంలో తోడ్పడాలని, వారి ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే లక్ష్యాన్ని సంస్థ ఏర్పరచుకుంది.

కేబీ సేన గౌరవాధ్యక్షులు ఫిలిం ప్రొడ్యూసర్ ఎ, ఎం. రత్నం గారు, జనరల్ సెక్రటరీ తమ్మయ్య నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ సమావేశం అత్యంత సమర్థవంతంగా నిర్వహించబడింది. బలిజ నాయుడుల ఐక్యత కోసం ఒక బలమైన సంఘాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ వేదిక ఏర్పడింది.

ఈ సభలో పాల్గొన్న పలువురు ప్రముఖులు కాపు, బలిజ సమాజం యొక్క ప్రస్తుత పరిస్థితులు, వారి సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి అవసరాలపై విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు. ముఖ్యంగా ఎన్విడియా  వైస్ ప్రెసిడెంట్, అలాగే ప్రైమ్ నైన్ డైరెక్టర్ అయిన కొండా నరేంద్ర గారు, పీఎంఆర్ గ్రూప్ చైర్మన్ ముత్తు వేల్ రాజ్ గారు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా హాజరై ఈ కార్యక్రమానికి విశిష్టతను తీసుకువచ్చారు.

ఆంధ్రప్రదేశ్ పర్యాటకం & సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు మాట్లాడుతూ బలిజ సంఘీయులు విద్య, ఉద్యోగ మరియు రాజకీయ రంగాలలో రాణించాలి అన్నారు. యువతకి ముందునుంచే నైపుణ్యం కల్పించాలి మరియు యువతను ప్రోత్సహించాలి అన్నారు. 

నువ్వు నేను కలిస్తే మనం..
మనం మనం కలిస్తే జనం..
జనం జనం కలిస్తే ప్రభంజనం!  

మనందరం కలిసి మరెన్నో సాధించాలి అన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ లో లక్ష్మీ నర్సుసెట్టి గారు సమాజ సేవలో విశేషంగా కృషి చేసిన ప్రముఖ వ్యక్తి, వారి సేవలను గుర్తు చేసుకున్నారు.

ప్రభుత్వం నుండి మరిన్ని ప్రయోజనాలు పొందడానికి సమిష్టి కృషి అవసరమని డాక్టర్ హరిప్రసాద్ గారు పిలుపునిచ్చారు.

తమిళనాడులో సుమారు 40 లక్షలకు పైగా బలిజులు ఉన్నప్పటికీ, వారికి తగిన రాజకీయ మరియు సామాజిక ప్రాతినిధ్యం లభించడం లేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కాపు, బలిజ, గవరబలిజ వంటి వివిధ రకాల పేర్లతో పిలవబడుతూ ఒకే సామాజిక వర్గంగ వున్నారు. వీరు సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వారు స్పష్టం చేశారు. 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి ఒక్కడిగ ప్రారంభించి ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు ఎంతో ప్రభావవంతమైన నాయకుడుగా ఎదిగారు అన్నారు. భారత ప్రధాన మంత్రి మోడీ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తులతో ఒకడిగా నిలిచారు అన్నారు. 

అంతేకాకుండా, కొండా నరేంద్ర గారు సూచిస్తూ ఈ సంస్థ రాబోయే కాలంలో పేద విద్యార్థులకు విద్యా సహాయం అందించడం, వారి భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వామ్యం కావడం వంటి సేవా కార్యక్రమాలను చేపట్టాలి అన్నారు.

పీఎంఆర్ గ్రూప్ చైర్మన్ ముత్తువేల్ రాజ్ గారు సెమీకండక్టర్ వంటి వ్యాపార రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఏ.ఎం. రత్నం గారు మాట్లాడుతూ, రాబోయే కాలంలో తమిళనాడు అంతటా విస్తరించి ఉన్న బలిజ, కాపు, గవరబలిజ సోదరులను ఒకే తాటిపైకి తీసుకువస్తామని ఆకాంక్షించారు.

తమ్మయ్య నాయుడు గారు మాట్లాడుతూ ఉచిత వివాహ పరిచయ సేవలు (Matrimonial Services), విద్యా సేవలు మరియు పరస్పర సహకారంతో వ్యాపార అవకాశాలను కల్పించే కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

బలిజుల చారిత్రక ప్రాముఖ్యతను కూడా ఈ వేదికలో గుర్తుచేశారు. బలిజ రాజులైన శ్రీకృష్ణదేవరాయలు, తిరుమల నాయకర్ వంటి మహానుభావులు దక్షిణ భారతదేశంలో అనేక ఆలయాల నిర్మాణం మరియు పునరుద్ధరణకు చేసిన సేవలను స్మరించుకున్నారు. వేలూరు నుండి వచ్చిన ప్రభు గారు బలిజుల గొప్ప చరిత్రను మరియు వారి సామాజిక ప్రాధాన్యతను విపులంగా వివరించారు.

ఈ సందర్భంగా బలిజ సమాజం ఒక సంఘటిత శక్తిగా ఎదగాల్సిన అవసరాన్ని అందరూ నొక్కిచెప్పారు. ప్రస్తుతం చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ సంస్థ, భవిష్యత్తులో మహా వృక్షంగా ఎదగాలని ఆకాంక్షించారు. సంఘ అభివృద్ధి కోసం 50 లక్షల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, మొదటి విరాళంగా కొండా నరేంద్ర గారు రూ. 5 లక్షలు ప్రకటించడం విశేషం.